Hunger: ప్రపంచంలో నిమిషానికి 11 ఆకలి చావులు: ఆక్స్​ ఫాం నివేదికలో ఆందోళన

11 Hunger Deaths For Every Minute In the World

  • ‘ఆకలి వైరస్ ఎక్కువైంది’ పేరిట రిపోర్ట్
  • ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది
  • గత ఏడాదితో పోలిస్తే 2 కోట్లు ఎక్కువ

కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దల మాట. ఎన్ని కోట్లు సంపాదించినా టైంకు ఇంత ముద్ద కడుపులో పడాల్సిందే. కానీ, కొన్ని కోట్ల మందికి ఆ బుక్కెడు బువ్వే దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను తోడేస్తోంది. రోజూ వందలాది మందిని కబళిస్తోంది. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారు.

ఇవ్వాళ ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలితో 11 మంది ఊపిరి వదులుతున్నారని పేర్కొంది.

ఈ ఏడాది కరోనా తెచ్చిన కష్టంతో ప్రపంచంలోని 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య 2 కోట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది.

కరోనా, లాక్ డౌన్ లతో ముదిరిన ఆర్థిక సంక్షోభానికి తోడు యుద్ధ సంక్షోభంతో దాదాపు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా దేశాలు కరోనా ఉన్నా తమ తమ బలగాల పటిష్ఠత కోసం 5,100 కోట్ల డాలర్లను ఖర్చు చేశాయని, అది ప్రపంచంలోని పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఆరు రెట్లు ఎక్కువని వెల్లడించింది.

ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి యుద్ధ సంక్షుభిత దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాబిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని, అది ఈ దశాబ్దంలోనే అత్యంత ఎక్కువని ఆవేదన చెందింది. అది కూడా నిరుపేదలను ఆకలి రాజ్యంలోకి నెట్టేసిందని పేర్కొంది.

  • Loading...

More Telugu News