Kappa Variant: కరోనాలో కొత్త రకం... యూపీలో 'కప్పా' వేరియంట్ కేసులు!
- రెండు కేసుల్లో కప్పా వేరియంట్
- లక్నోలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు
- కరోనా మళ్లీ రూపు మార్చుకుందన్న అధికారులు
- ఇప్పటివరకు ఇద్దరిలో కప్పా వేరియంట్
- చికిత్స అందుబాటులో ఉందన్న అధికారులు
దేశంలో సెకండ్ వేవ్ సందర్భంగా కరోనా డెల్టా వేరియంట్ అతలాకుతలం చేసింది. భారత్ లోనే కాదు అనేక దేశాల్లో ఇతర కరోనా వైరస్ రకాలతో పోల్చితే ఈ డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది. అయితే, కరోనా వైరస్ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలకు గురవుతూ కొత్త రూపం సంతరించుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లో రెండు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇది త్వరగా వ్యాపించే లక్షణమున్న వేరియంట్ అని భావిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్ ను నిర్ధారించారు.
కరోనా కొత్త వేరియంట్ ను రాష్ట్రంలో గుర్తించడంపై అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సమాచారం అందించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని వివరించారు.