Vijay Sai Reddy: రఘురామపై వేటు వేయాల్సిందేనన్న విజయసాయి... స్పీకర్ నే బెదిరిస్తున్నారంటూ రఘురామ లేఖ
- రఘురామ వర్సెస్ వైసీపీ
- ఢిల్లీ చేరిన పోరు
- స్పీకర్ ను కలిసిన వైసీపీ నేత
- అనర్హత పిటిషన్ వేశామన్న విజయసాయి
- పార్లమెంటును స్తంభింపచేస్తామని హెచ్చరిక
- విజయసాయికి బెదిరింపులు అలవాటేన్న రఘురామ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు, వైసీపీ అధినాయకత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఢిల్లీ చేరింది. రఘురామకృష్ణరాజుపై తాము ఏడాది కిందట అనర్హత పిటిషన్ వేశామని, దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను డిమాండ్ చేశారు. లేకపోతే పార్లమెంటులో ఆందోళన చేపట్టడమే కాకుండా, అవసరమైతే పార్లమెంటును కూడా స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
దీనిపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటామని విజయసాయి స్పీకర్ పై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సభాహక్కుల సంఘం చైర్మన్ కు లేఖ రాశారు. విజయసాయికి ఇలాంటి వ్యాఖ్యలు కొత్త కాదని, గతంలో రాజ్యసభ చైర్మన్ పైనా బెదిరింపులకు దిగారని, ఇప్పుడదే రీతిలో స్పీకర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభాహక్కుల సంఘం చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.