Visakhapatnam: ఖమ్మం-దేవరాపల్లి మార్గానికి జాతీయ హోదా.. నంబరు కేటాయించిన కేంద్రం
- త్వరలోనే ప్రారంభం కానున్న భూసేకరణ ప్రక్రియ
- విస్తరణ పనులు పూర్తయితే హైదరాబాద్-విశాఖ మధ్య అందుబాటులోకి మరో రహదారి
- సూర్యపేట-ఖమ్మం మార్గంలో కొనసాగుతున్న విస్తరణ పనులు
తెలంగాణలోని ఖమ్మం నుంచి ఏపీలోని దేవరాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల మార్గానికి కేంద్రం జాతీయ హోదా కల్పిస్తూ 765 డీజీ నంబరును కేటాయించింది. ఈ మేరకు నిన్న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 158 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం కనుక పూర్తయితే హైదరాబాద్-విశాఖపట్టణం అనుసంధానత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్-సూర్యాపేట మధ్య ఇప్పటికే జాతీయ రహదారి అందుబాటులో ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లేన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. దేవరాపల్లి నుంచి విశాఖకు ఇప్పటికే నాలుగు లేన్ల మార్గం ఉంది. కాబట్టి సూర్యాపేట-ఖమ్మం, ఖమ్మం-దేవరాపల్లి పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి 625 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి వస్తుంది. ఖమ్మం-దేవరాపల్లి మార్గానికి కేంద్రం తాజాగా నంబరు కూడా కేటాయించడంతో త్వరలోనే భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది.