CPI Narayana: ప్రతిపక్షాల తరపున శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరుస్తాం: సీపీఐ నారాయణ
- బీజేపీ వ్యతిరేక పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తాం
- ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం బూటకం
- వెంకయ్యనాయుడు చెబితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది
2023లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బలపరుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవాలని నారాయణ కోరారు. ఆయన ఒక్క మాట చెబితే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందని అన్నారు.
ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై నారాయణ మాట్లాడుతూ.. ఇదంతా బూటకమని, ప్రజల్లో భ్రమను కలగించడం ద్వారా వారి మెప్పు పొందేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రో ధరలపై మాట్లాడుతూ.. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నారాయణ డిమాండ్ చేశారు.