Ratan Tata: ఆర్కిటెక్ట్ గా కొనసాగకపోవడం వెలితిగా ఉంది: రతన్ టాటా
- ఆర్కిటెక్ట్ ఉద్యోగాన్ని వదిలి వ్యాపార రంగంలోకి రావాల్సి వచ్చింది
- నేను ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడను
- ఆర్కిటెక్చర్ కోర్సులో నేర్పించిన పాఠాలు వ్యాపారంలో ఉపయోగపడ్డాయి
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన జీవితంలో ఎన్నో విజయాలను సాధించారు. టాటా సంస్థల వ్యాపారాన్ని విజయపథంలో నడిపిస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించారు. అయితే ఒక విషయంలో మాత్రం ఆయన ఇప్పటికీ విచారిస్తున్నారట. తనకు ఎంతో ఇష్టమైన ఆర్కిటెక్చర్ వృత్తిని వదిలేసి వ్యాపార రంగంలోకి రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేసినా... ఆ వృత్తిలో కొనసాగకపోవడం తనకు వెలితిగా ఉంటుందని చెప్పారు. తాను ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడనని... ఆర్కిటెక్ట్ గా కొనసాగకపోవడం పట్ల తాను చింతిస్తున్నానని రతన్ టాటా తెలిపారు.
ఆర్కిటెక్చర్ కోర్సులో నేర్పించిన పాఠాలు వ్యాపారంలో తనకు ఎంతో ఉపయోగపడ్డాయని రతన్ టాటా చెప్పారు. ఇచ్చిన బడ్జెట్లోనే ప్రాజెక్టును పూర్తి చేయగలిగే సామర్థ్యం, వివిధ రూపాల్లో వచ్చే సమస్యలను ఎదుర్కోగలిగే నేర్పు ఆర్కిటెక్చర్ లో నేర్పించారని తెలిపారు. ఎవరైనా ఒక ఆర్కిటెక్ట్ వ్యాపారవేత్త కాలేడనే వ్యాఖ్యలను తాను ఖండిస్తానని చెప్పారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.