Peddireddi Ramachandra Reddy: జీవో నెం.2ని హైకోర్టు సస్పెండ్ చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన
- వీఆర్ఓలకు అధికారాల బదలాయింపు
- గతంలో జీవో-2 తీసుకువచ్చిన సర్కారు
- లోపాలు సరిదిద్దుకుంటామన్న పెద్దిరెడ్డి
- మళ్లీ జీవో జారీ చేస్తామని వెల్లడి
పంచాయతీ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శుల అధికారాల్లో కొన్ని వీఆర్ఓలకు బదలాయించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.2 జారీ చేయడం తెలిసిందే. ఈ జీవోను ఇవాళ హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. జీవో నెం.2లో లోపాలు ఉన్నాయని తాము గుర్తించామని, ఆ లోపాలను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. సర్పంచ్ ల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. అయితే, లోపాలను సరిదిద్దే లోపే కొందరు కోర్టును ఆశ్రయించారని వెల్లడించారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, వాటిని తగిన విధంగా బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడెలాగూ కోర్టు జీవోను కొట్టివేసింది కాబట్టి, లోపాలను సరిదిద్దుకుని మళ్లీ జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దీనిపై న్యాయ విభాగంతోనూ, సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.