Nintendo: పాతికేళ్ల నాటి వీడియో గేమ్ కు వేలంలో రూ.11 కోట్లు!
- వీడియో గేములకు నింటెండో ప్రపంచ ప్రసిద్ధి
- గేమింగ్ దిగ్గజంగా ఎదిగిన జపాన్ సంస్థ
- వేలానికి 1996లో తయారైన గేమింగ్ కన్సోల్
- సొంతం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి
వీడియో గేమ్ లు అంటే కుర్రకారు ఎంత మోజు ప్రదర్శిస్తుందో చెప్పనక్కర్లేదు. యువత అనే కాదు, పిల్లలు, పెద్దలు కూడా వీడియో గేమ్ లను ఇష్టపడతారు. వీడియో గేమ్ లు, వాటిని ఆడే కన్సోల్స్ తయారీలో నింటెండో సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నింటెండో ఓ జపాన్ కంపెనీ. 1977లో ఈ సంస్థ నుంచి తొలి వీడియో గేమ్ విడుదల కాగా, 80వ దశకం తర్వాత ఈ సంస్థ మార్కెట్ ను శాసించే స్థితికి చేరింది. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల ఎలక్ట్రానిక్ మార్కెట్లలోనూ ఎక్కడ చూసినా నింటెండో వీడియో గేములు, గేమింగ్ కన్సోల్స్ కనిపించేవంటే అతిశయోక్తి కాదు.
ఇక అసలు విషయానికొస్తే... ఈ సంస్థ 1996లో తయారుచేసిన ఓ వీడియో గేమ్ కన్సోల్ ను ఇటీవల వేలం వేశారు. ఓ అజ్ఞాతవ్యక్తి ఆ నింటెండో సూపర్ మారియో-64 గేమింగ్ కన్సోల్ ను రూ.11.6 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. అమెరికాలోని టెక్సాస్ హెరిటేజ్ వేలం సంస్థ ఈ వేలం నిర్వహించింది.
నింటెండో సంస్థ తయారుచేసిన సూపర్ మారియో-64 గేమింగ్ కన్సోల్ అప్పట్లో అమ్మకాల దుమ్ము దులిపింది. ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. నింటెండో సంస్థకు బాగా పేరుతెచ్చిపెట్టిన వీడియో గేమింగ్ కన్సోల్స్ లో సూపర్ మారియో-64 ప్రముఖమైనది.