Andhra Pradesh: 'నరేగా' బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి: ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం
- పలు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
- నరేగా బకాయిలు చెల్లించకపోవడంపై ఆగ్రహం
- గతంలో ఆదేశాలు ఇచ్చామన్న హైకోర్టు
- ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడి
జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) బకాయిల చెల్లింపుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమారు రూ.2,500 కోట్ల మేర నరేగా బిల్లులు పెండింగ్ లో ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 1వ తేదీ లోపు నరేగా బకాయిలు చెల్లించాలని, లేకపోతే పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
నరేగా బకాయిల చెల్లింపులపై తాము ఇంతకుముందు చేసిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదని, ఇంకెన్నిసార్లు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. నరేగా నిధులపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కాగా, విచారణకు ఏపీ సీఎస్ ను కూడా పిలిపించాలని కోర్టు ఓ దశలో భావించింది. అయితే, బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడంతో కోర్టు ఆ ఆలోచనను విరమించుకుంది.