Nagababu: 'మా' ఎన్నికలపై బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు స్పందన
- త్వరలో 'మా' అధ్యక్ష ఎన్నికలు
- 'మా' ఎన్నికల్లో బహుముఖ పోటీ
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలయ్య
- మంచు విష్ణుకు మద్దతిస్తున్నట్టు వెల్లడి
- విష్ణుకు క్లారిటీ ఉందా? అన్న నాగబాబు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈసారి బహుముఖ పోటీ నెలకొనడంతో ఆ స్థాయిలోనే వాడీవేడి వాతావరణం నెలకొంది. 'మా' ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత కాక పెంచాయి.
"టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు, వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో 'మా'కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా!" అని బాలయ్య ప్రశ్నించారు. ఇప్పటివరకు 'మా'కు శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదు? అని నిలదీశారు. 'మా' కోసం శాశ్వత భవనం అజెండాతో ముందుకు వచ్చిన మంచు విష్ణుకు మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.
'మా'కు గతంలో అధ్యక్షుడిగా పోటీ చేసిన మురళీమోహన్ పోరాటం చేసి ఉంటే ఎప్పుడో శాశ్వత భవనం సాకారమయ్యేదని అభిప్రాయపడ్డారు. గతంలో 'మా'కు నాయకత్వం వహించినవాళ్లు భవనం విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇప్పుడు మంచు విష్ణు వచ్చి శాశ్వత భవనం నిర్మిస్తామంటున్నారని, అసలు ఆయనకు స్థలంపై ఏం స్పష్టత ఉందని నాగబాబు ప్రశ్నించారు.
అన్ని అంశాల్లో స్పష్టత ఉంది కాబట్టే తాము ప్రకాశ్ రాజ్ కు మద్దతిస్తున్నామని ఉద్ఘాటించారు. ఏకగ్రీవం అంశాన్ని తాము ఆమోదించబోమని, అభ్యర్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటామని నాగబాబు తమ వైఖరి వెల్లడించారు.