Rahul Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే భయపడేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండనక్కర్లేదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi said they do not needed who fears towards BJP and RSS
  • కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తో రాహుల్ భేటీ
  • తమకు ధైర్యవంతులు కావాలని వెల్లడి
  • తమ సిద్ధాంతం అదేనని ఉద్ఘాటన
  • తన సందేశం కూడా ఇదేనని స్పష్టీకరణ
పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే కార్యకలాపాలకు పాల్పడేవారికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే భయపడేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండనక్కర్లేదని తేల్చిచెప్పారు. అలాంటివాళ్లు తమకు అక్కర్లేదని, వారిని బయటికి సాగనంపుతామని వెల్లడించారు.

అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీలో లేని వారు చాలామంది బీజేపీని వ్యతిరేకిస్తున్నారని, బీజేపీ అంటే భయపడని వారందరినీ తమ వారిగానే భావిస్తామని పేర్కొన్నారు. అలాంటి వారిని పార్టీలోకి తీసుకురండి అని కాంగ్రెస్ శ్రేణులకు ఉద్బోధించారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో రాహుల్ స్పందిస్తూ, ఇటీవల పార్టీని వీడిన నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీని వీడిన నేతల గురించి ఉదహరిస్తూ జ్యోతిరాదిత్య సింథియా గురించి ప్రస్తావించారు.

"అతడు తన వారిని కాపాడుకునేందుకు భయపడిపోయి ఆర్ఎస్ఎస్ తో చేతులు కలిపాడు. అలాంటి వాళ్లు ఇంకెవరైనా ఉంటే వెళ్లిపోండి. వారిని ఆర్ఎస్ఎస్ వాదులుగానే భావిస్తాం. మాకు నిర్భయంగా మాట్లాడేవాళ్లు కావాలి. మా సిద్ధాంతం ఇదే. పార్టీ శ్రేణులకు నేను మొట్టమొదట ఇచ్చే సందేశం కూడా ఇదే" అని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు.
Rahul Gandhi
Congress
BJP
RSS
India

More Telugu News