Sanjal Gavande: అమెజాన్ అధినేత బెజోస్ అంతరిక్షయానంలోనూ భారతీయ మూలాలు!
- ఇటీవలే వర్జిన్ సంస్థ రోదసియాత్ర
- ఇప్పుడు బ్లూ ఆరిజన్ వంతు
- ఈ నెల 20న రోదసిలోకి వెళ్లనున్న బెజోస్
- వ్యోమనౌకను అభివృద్ధి చేసిన బృందంలో మహారాష్ట్ర యువతి
ఇటీవలే వర్జిన్ గ్రూప్ సంస్థల అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్ సరదాగా అంతరిక్ష యానం చేసి కొత్త చరిత్రకు నాంది పలికారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహించిన ఈ రోదసియాత్రలో భారత సంతతి తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా ఈ నెల 20న అంతరిక్ష యాత్రకు బయల్దేరుతున్నారు. బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ రోదసియాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్ర కోసం న్యూ షెపర్డ్ అనే స్పేస్ క్రాఫ్టును సిద్ధం చేస్తున్నారు.
అయితే, ఈ వ్యోమనౌక అభివృద్దిలోనూ భారతీయు మూలాలు ఉండడం విశేషం. భారత సంతతికి చెందిన సంజల్ గవాండే అనే యువతి న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్టును అభివృద్ధి చేసిన బృందంలో సభ్యురాలు. అంతేకాదు, సంజల్... బెజోస్ తో పాటు అంతరిక్షయానం కూడా చేయబోతున్నారు.
ఆమె ప్రస్తుతం బ్లూ ఆరిజిన్ సంస్థలో సిస్టమ్స్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. సంజల్ గవాండే మహారాష్ట్రకు చెందిన యువతి. ఆమె తండ్రి పురపాలక శాఖ ఉద్యోగి. ముంబయి యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన సంజల్, ఆపై ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఏరోస్పేస్ సబ్టెక్టుతో మాస్టర్స్ డిగ్రీ చదివారు. అనంతరం పలు సంస్థల్లో పనిచేసిన ఆమె కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కూడా పొందారు.
కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆమెకు పౌరసత్వ కారణాలతో ఉద్యోగం నిరాకరించగా, బ్లూ ఆరిజిన్ సంస్థ ఆమెకు సిస్టమ్స్ ఇంజినీర్ గా అవకాశం కల్పించింది. అక్కడ్నించి సంజల్ వృత్తిపరంగా ఎంతో ఎదిగారు. అంతరిక్ష యానంలో అత్యంత కీలకమైన వ్యోమనౌకలను అభివృద్ధి చేసే బృందంలో స్థానం సంపాదించుకున్నారు.