Parliament: రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు.. ఈ అంశాలపై ప్రశ్నించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ప్రతిపక్షాలు
- కరోనా, రాఫెల్, చైనా అంశాలపై ప్రశ్నించనున్న కాంగ్రెస్
- గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని లేవనెత్తాలని టీఆర్ఎస్ నిర్ణయం
- విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రస్తావించనున్న వైసీపీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో పలు సమస్యలపై నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు వేసుకున్నాయి. కరోనాతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు, చైనాతో పరిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై కేంద్ర సర్కారుని ప్రశ్నించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని లేవనెత్తాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అలాగే, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రస్తావించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. పోలవరం నిధులు, విశాఖ ఉక్కు అంశాలపై కూడా ప్రశ్నించనుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలను లేవనెత్తాలని టీడీపీ భావిస్తోంది.
కాగా, రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యుల్లో అధిక శాతం మంది ఇప్పటికే కరోనా టీకాలు తీసుకున్నారు. సాగుచట్టాలపై రైతుల ఉద్యమం, కరోనా పరిస్థితులు, నిరుద్యోగం వంటి అంశాలు ఈ సమావేశాల్లో కీలకం కానున్నాయి. అలాగే, పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్రతిపక్షాలు గట్టిగా నిలదీసే అవకాశం ఉంది.