Ramana: తెలుగువాళ్లు భాషాభిమానులే తప్ప దురభిమానులు కాదు: జస్టిస్ ఎన్వీ రమణ

CJI NV Ramana inaugurates Ashtavadhanam

  • మేడసాని మోహన్ ఆధ్వర్యంలో అష్టావధానం
  • పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ
  • తొలి ప్రశ్న వేసి అష్టావధానం ప్రారంభం
  • తెలుగు భాషపై మమకారం చాటిన వైనం

ప్రఖ్యాత అవధాని మేడసాని మోహన్ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి ఇవాళ చతుర్గుణిత అవధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సాహితీ ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా పాల్గొన్నారు. అవధానికి తొలి ప్రశ్న వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష, తెలుగు సాహిత్యంపై తన మమకారాన్ని చాటారు. తెలుగు భాషకు అష్టావధానం ప్రక్రియ ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. తెలుగు ప్రజలు భాషాభిమానులే తప్ప భాషా దురభిమానులు కారని స్పష్టం చేశారు.

మధురమైన తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సాహితీ ప్రక్రియలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. జ్ఞాపకశక్తి, అన్ని అంశాలపైనా మేధస్సు, భాషపై పట్టు... వీటి కలయికే అష్టావధానం అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. అయితే, తెలుగు భాషకు ఆదరణ తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భాషాభివృద్ధికి, సాహితీ సేవకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన ఉద్ఘాటించారు.

వివిధ సాహితీ ప్రక్రియలను అన్ని వర్గాలకు చేరువ చేసేందుకు ప్రయత్నించాలని, సాహితీ ప్రక్రియలు ఎంతో అపురూపమైనవని, ఒక్కసారి అంతరించిపోతే వాటిని పునఃసృష్టి చేయలేమని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News