Maharashtra: నడిరోడ్డు మీద న్యాయవాది పై తల్వార్లతో దాడి
- ముంబైలో దాడికి పాల్పడిన 15 మంది
- అడ్డుకున్న వారిపైనా దాడులు
- తీవ్రగాయాలతో తప్పించుకున్న అడ్వొకేట్
- ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
నడిరోడ్డు మీద మిట్టమధ్యాహ్నం ఓ అడ్వొకేట్ పై దుండగులు తల్వార్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో అందరూ చూస్తుండగానే నిన్న మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. దాదాపు 15 మంది దారిలో అడ్వొకేట్ ను అడ్డుకుని గొడవకు దిగారని తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో ఆయనపై వారు దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపైనా దుండగ మూక దాష్టీకం ప్రదర్శించింది. వారిపైనా దాడి చేసింది.
కాగా, దాడి నుంచి ఆ అడ్వొకేట్ తప్పించుకుని బయటపడినా అప్పటికే తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన జుహూలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. దాడి ఘటనపై దహిసార్ లోని ఎంహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.