COVID19: ఒకే వ్యక్తిలో.. ఒకేసారి రెండు వేరియంట్లు, భారత్​ లో తొలి డబుల్​ ఇన్​ ఫెక్షన్​ కేసు!

Two Variants Found At a Time in One Person The First Case Of Double Infection In India
  • అసోం వైద్యురాలిలో గుర్తింపు
  • ఆమెలో ఆల్ఫా, డెల్టా వేరియంట్లు
  • మే తొలి వారంలోనే కేసు
  • టీకా రెండు డోసులు వేసుకున్నా సోకిన వైనం
మామూలుగా ఓ వ్యక్తికి ఒకేసారి ఒక కరోనా వేరియంట్ మాత్రమే సోకడం ఇప్పటిదాకా చూశాం. కానీ, దేశంలోని తొలిసారిగా ఒక వ్యక్తికి ఒకేసారి రెండు వేరియంట్లు సోకిన ఘటన అసోంలో వెలుగు చూసింది. దిబ్రూగఢ్ లోని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్ఎంఆర్ సీ)లో పరీక్ష చేయించుకున్న ఓ వైద్యురాలికి రెండు వేరియంట్లు ఒకేసారి సోకినట్టు గుర్తించారు.

వైద్యురాలు వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నప్పటికీ.. ఆల్ఫా, డెల్టా రకాల కరోనా సోకిందని ఆర్ఎంఆర్ సీ పేర్కొంది. అయితే, స్వల్ప లక్షణాలతో ఇబ్బందిపడిన ఆమె.. ఆసుపత్రిలో చేరకుండానే కోలుకున్నారని తెలిపింది. రెండు వేరియంట్లు ఒకేసారి సోకిన ఘటనలను ‘డబుల్ ఇన్ ఫెక్షన్’ అంటారని ఆర్ఎంఆర్ సీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.జె. బోర్కకోటీ చెప్పారు. ఓ వ్యక్తికి ఏదైనా వేరియంట్ సోకిన రెండు మూడు రోజుల్లో కానీ, లేదా ప్రతిరక్షకాలు ఉత్పత్తి కావడానికి ముందుగా కానీ ఇలా మరో వేరియంట్ కూడా సోకే అవకాశం ఉంటుందని చెప్పారు.

మే తొలి వారంలోనే ఈ కేసు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. వైద్యురాలి భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకినట్టు తేల్చారు. ఇలాంటి డబుల్ ఇన్ ఫెక్షన్ కేసులు చాలా అరుదని ఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఐజీఐబీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు.
COVID19
Delta Variant
Alpha Variant
Double Infection

More Telugu News