Etela Rajender: 20 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నా: ఈటల
- కరోనా కాలం మినహా నిరంతరం ప్రజలతోనే ఉన్నా
- తెలంగాణ ఉద్యమ సమయం కంటే ఇప్పుడే ఎక్కువ నిర్బంధం ఉంది
- ధర్మాన్ని కాపాడేందుకే వర్షంలో కూడా పాదయాత్రను కొనసాగిస్తున్నా
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఈరోజు పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నానని చెప్పారు. ఒక్క కరోనా కాలం మినహా నిరంతరం ప్రజలతోనే ఉన్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప్పల్ లో 72 గంటల పాటు రైలు పట్టాలపై పడుకున్నప్పుడు నియోజకవర్గ ప్రజలందరూ తన వెంటే ఉన్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయం కంటే రాష్ట్రంలో ఇప్పుడే ఎక్కువ నిర్బంధం ఉందని ఈటల మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, గౌరవం లేవని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక చాలా కీలకమని... ఈ ఎన్నికలో కేసీఆర్ అహంకారాన్ని గెలిపిస్తారా? లేక పేదల గొంతుక అయిన ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ధర్మాన్ని కాపాడాలనే ఈ వర్షంలో కూడా పాదయాత్రను కొనసాగిస్తున్నానని చెప్పారు.