KCR: నన్ను తిట్టినన్ని తిట్లు ఎవరినీ తిట్టి ఉండరు: కేసీఆర్
- తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను ఎన్నో విధాలుగా అవహేళన చేశారు
- ఎవరేమనుకున్నా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాం
- ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాం
తెలంగాణ ఉద్యమ సమయంలో తనను ఎన్నో విధాలుగా అవహేళన చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తన శరీర భాగాలను కూడా కించపరుస్తూ కామెంట్లు చేశారని... అయినా తాను భయపడలేదని, వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎవరేమనుకున్నా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అంటే మఠం కాదని... ఇదొక రాజకీయ పార్టీ అని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారనే విమర్శలకు సమాధానంగా... ఎన్నికల్లో లబ్ధి కోసం కచ్చితంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలవలేని పార్టీలే హామీలు ఇస్తుంటే... గెలిచే పార్టీ అయిన మేము ఎందుకు ఇవ్వమని అన్నారు. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని కేసీఆర్ విమర్శించారు. ఒకప్పుడు చెట్లను కొట్టడమే కానీ, పెట్టడం ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో పచ్చదనం పెరిగిందని, ఇన్ని చెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. 12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు గ్రామాల్లో చెత్తను ఎత్తేస్తున్నారని చెప్పారు.