India: దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ వ్యవహారంలో పాకిస్థాన్ పై భారత్, ఆఫ్ఘనిస్థాన్ ఆగ్రహం
- ఇస్లామాబాద్ లో ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్
- భారత్ పై ఆరోపణలు చేసిన పాక్ మంత్రి
- అనవసరంగా లాగుతున్నారన్న భారత్
- పాక్ బాధ్యత లేకుండా మాట్లాడుతోందన్న ఆఫ్ఘన్
పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఆఫ్ఘనిస్థాన్ దౌత్యవేత్త కుమార్తెను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పాల్జేసిన వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. దీనిపై భారత్, ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా స్పందించాయి. పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. ఓ దౌత్యవేత్త కుమార్తె కేసును ఇలాగేనా పర్యవేక్షించేది? అంటూ మండిపడ్డాయి.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి మాట్లాడుతూ... భారత్ ఈ వ్యవహారంలో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తోందని అన్నారు. పాక్ హోంమంత్రి రషీద్ అహ్మద్ అనవసరంగా భారత్ ను ఈ వ్యవహారంలోకి లాగారని ఆరోపించారు. భారత నిఘా వర్గాల కుట్ర వల్లే ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ జరిగిందని రషీద్ అహ్మద్ అంటున్నారని, అందుకే తాము ఈ విషయంలో స్పందిస్తున్నామని ఆరిందమ్ బాగ్చి తెలిపారు. పాకిస్థాన్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
అటు, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడింది. ఇస్లామాబాద్ లో ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ జరిగినట్టు ఆధారాలు లేవని వ్యాఖ్యానించడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అపనమ్మకానికి దారితీస్తాయని పేర్కొంది.