Telangana: కుటుంబ సభ్యులతో కలసి జెన్కో ఉద్యోగి అదృశ్యం.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ
- నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఘటన
- ఆర్థిక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న రామయ్య
- తాను చనిపోతే భార్యాబిడ్డలు అనాథలవుతారని ఆవేదన
- అందుకే వారిని కూడా తనతోపాటు తీసుకెళ్తున్నట్టు లేఖ
జెన్కోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. భార్యాబిడ్డలతో కలిసి అదృశ్యమైన ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో కలకలం రేపుతోంది. స్థానికంగా నివాసం ఉండే మండారి రామయ్య (36) జెన్కోలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య నాగమణి (30), కుమారుడు సాత్విక్ (12) ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతోపాటు అనారోగ్య సమస్యలు వేధిస్తుండడంతో రామయ్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తానొక్కడిని చనిపోతే వారు అనాథలు అవుతారని భావించి వారిని కూడా తనతోపాటు తీసుకెళ్లినట్టు ఇంట్లో వదిలిపెట్టిన లేఖలో పేర్కొన్నాడు.
వారి కోసం గాలిస్తుండగా కొత్త వంతెనపై అతడి బైక్, ఫోన్ లభించడంతో అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు, బంధువులు నదిలో గాలిస్తున్నారు. వారు ముగ్గురు బైక్‌పై వెళ్లినట్టు సీసీకెమెరాలో కూడా రికార్డయినట్టు పోలీసులు తెలిపారు.
తిరుమలగిరి (సాగర్) మండలం చింతలపాలేనికి చెందిన రామయ్య వ్యవసాయ భూమి టెయిల్‌పాడ్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది. నిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాల్లో భాగంగా రామయ్యకు జెన్కోలో అటెండర్ ఉద్యోగం లభించినట్టు పోలీసులు తెలిపారు.