Kollywood: రూ. లక్ష జరిమానాపై అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన కోలీవుడ్ హీరో విజయ్
- కారు దిగుమతి కేసులో విజయ్‌కు రూ. లక్ష జరిమానా విధించిన హైకోర్టు
- ద్విసభ్య ధర్మాసనం ముందుకు విజయ్ అప్పీల్ పిటిషన్
- సోమవారం విచారణకు వచ్చే అవకాశం
ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారు దిగుమతి చేసుకుని ఎంట్రీ పన్ను చెల్లించనందుకు ప్రముఖ తమిళ సినీ కథానాయకుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు ఇటీవల లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కొవిడ్ కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, పన్ను చెల్లించకుంటే కనుక కారు ఖరీదులో 20 శాతాన్ని రెండు వారాల్లో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు, పన్ను ఎగవేయడం దేశవ్యతిరేకమని వ్యాఖ్యానించింది.
న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం విధించిన జరిమానా, చేసిన వ్యాఖ్యలపై విజయ్ తాజాగా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఈ అప్పీల్‌తో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు నకలు జతచేయని కారణంగా విచారణ జాబితాలో విజయ్ పిటిషన్‌ను పొందుపరచలేదు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు.. విజయ్ అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ దురైస్వామి, జస్టిస్ హేమలతతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి సిఫారసు చేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.