Heavy Rains: తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు.. వందల గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు
- వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం
- కుమురం భీం జిల్లాలో అత్యధికంగా 27.30 సెంటీమీటర్ల వర్షపాతం
- నిండుకుండలను తలపిస్తున్న గోదావరి ప్రాజెక్టులు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లు మునిగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. నిర్మల్, భైంసా పట్టణాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. కుమురంభీం జిల్లా వాంకిడిలో నిన్న అత్యధికంగా 27.30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భారీ వర్షాలకు గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం వెంకూరు చెరువుకట్ట తెగడంతో చేను పనులకు వెళ్లిన దంపతులు చిక్కుకుపోగా అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కుమురం భీం జిల్లాలోని చింతలమాదర జలపాతంలో మొన్న గల్లంతైన మహారాష్ట్రకు చెందిన రాంవిజయ్ లోబడే (23) మృతి చెందాడు.
వరంగల్ జిల్లాలో ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. లక్నవరం సరస్సులో 27 అడుగులు, రామప్ప చెరువులో 31 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్పల్లి పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో వరినాట్ల కోసం వెళ్లిన 21 మంది కూలీలు చిక్కుకుపోయారు. పోలీసులు వారిని రక్షించారు.
ఇదే జిల్లాలోని అనంతారం వాగులోకి గత రాత్రి వేగంగా వచ్చిన ఓ కారు బారికేడ్లను ఢీకొడుతూ వెళ్లి వాగులో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో ఓ ఆశ్రమాన్ని వరద నీరు చుట్టేయడంతో ఏడుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు బయలుదేరారు. భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. అల్పపీడనం నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుబాటులో ఉండాలంటూ అధికారులను ఆదేశించింది.