NGT: ఏపీ సహకరించట్లేదు.. మీరే వచ్చి చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనపై ఎన్జీటీకి తెలంగాణ విజ్ఞప్తి
- హెలికాప్టర్ వసతి కల్పిస్తామని వెల్లడి
- ధిక్కరణ వ్యాజ్యాల విచారణ
- ఏపీతో సంబంధం లేకుండా వెళ్లాలని కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశం
- తామేమీ ధిక్కరించలేదన్న ఏపీ
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదని, కాబట్టి ఎన్జీటీనే స్వయంగా వచ్చి ప్రాజెక్టును పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అందుకు హెలికాప్టర్ సహా అన్ని సదుపాయాలనూ తామే కల్పిస్తామని తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గవినోళ్ల శ్రీనివాస్ అనే రైతు, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం విచారించింది.
ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించి రావాలన్న ఎన్జీటీ ఆదేశాలపై కృష్ణా బోర్డు అఫిడవిట్ వేసింది. అందులో ప్రాజెక్టు సందర్శన కోసం ఏపీ తమకు సహకరించడం లేదని పేర్కొంది. అయితే, కేంద్ర పర్యావరణ శాఖ నుంచి మాత్రం స్పందన రాలేదు. తాము ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించనేలేదంటూ ధిక్కరణ పిటిషన్లకు ఏపీ సమాధానమిచ్చింది. ప్రాజెక్టు సమగ్ర నివేదికకు సంబంధించిన అధ్యయనాల పనులను మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేసింది.
అన్ని పక్షాల వాదనలను విన్న ట్రైబ్యునల్.. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించి రావాల్సిందిగా కృష్ణా బోర్డును ఆదేశించింది. ఆ తర్వాత దానిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది.