Corona Vaccine: చిన్నారులకు టీకాలపై స్పష్టత నిచ్చిన ఎయిమ్స్ చీఫ్
- సెప్టెంబరు లోపే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్
- అనుమతుల కోసం వేచిచూస్తున్న జైకోవ్-డి, కొవాగ్జిన్
- ట్రయల్స్ జరుగుతున్నాయన్న గులేరియా
- ఇప్పటికే మోడెర్నా, ఫైజర్ లకు అనుమతి
భారత్ లో వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు.
జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ జైకోవ్-డీ పేరుతో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిందని, ఇది 12 ఏళ్లకు పైబడిన వారిపై పనిచేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రయోగాలు కూడా పూర్తయ్యాయని వివరించారు. చిన్నారులపై కొవాగ్జిన్ ట్రయల్స్ కూడా పూర్తి కావొస్తున్నాయని, అనుమతులు రాగానే పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమం షురూ అవుతుందని వివరించారు. సెప్టెంబరు లోపే పిల్లలకు వ్యాక్సినేషన్ ఉంటుందని రణదీప్ గులేరియా వెల్లడించారు. అటు, చిన్నారులకు ఇచ్చేందుకు గాను మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయని అన్నారు.