Yediyurappa: రాజీనామా చేస్తున్నా.. నాకు ఎప్పుడూ అగ్ని పరీక్షే: యడియూరప్ప కంటతడి
- రెండేళ్ల పాలనపై జరిగిన సమావేశంలో యడియూరప్ప ఉద్వేగం
- కేంద్ర మంత్రి పదవిని కూడా వద్దని, కర్ణాటకకే పరిమితమయ్యానని వ్యాఖ్య
- ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని ఆవేదన
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఈరోజు జరిగిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ, తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.
అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని... కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందని చెప్పారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని... అయినప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపానని అన్నారు. కర్ణాటక ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని యడియూరప్ప అందించనున్నారు.