Bihar: హెల్మెట్లు పెట్టుకుని, ప్రథమ చికిత్స పెట్టెలు పట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు ఆర్జేడీ ఎమ్మెల్యేలు!
- గత అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం
- ఆర్జేడీ ఎమ్మెల్యేలకు గాయాలు
- దీంతో నేడు వినూత్న రీతిలో నిరసన
బీహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్యేలు హెల్మెట్లు పెట్టుకుని, ప్రథమ చికిత్స పెట్టెలు పట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీనిపై ఆర్జేడీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... 'అసెంబ్లీలోనే మమ్మల్ని చంపేయడానికి మార్చి 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గూండాలను రప్పించారు. ఆ ఘటనలో కేవలం పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసి వదిలేయడం సరికాదు' అని అన్నారు. తమకు మరోసారి గాయాలు కాకుండా ఉండేందుకే తగిన ఏర్పాట్లు చేసుకుని వచ్చామని చెప్పారు.
కాగా, మార్చి 23న బీహార్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష నేతలు ఆందోళన చేయడంతో అసెంబ్లీలోకి పోలీసులు ప్రవేశించడం పట్ల ఆర్జేడీ అప్పట్లో మండిపడింది. తమ ఎమ్మెల్యేలు కొంత మందికి గాయాలయ్యాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో హెల్మెట్లు పెట్టుకుని, ప్రథమ చికిత్స పెట్టెలు పట్టుకుని వచ్చి ఆర్జేడీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.