mithun reddy: ఎంఎస్‌ఎంఈల అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్
- రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలన్న మిధున్ రెడ్డి
- ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలని విజ్ఞప్తి
- ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు తాము ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్న నిర్మల
రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన జరగాలని వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే, దేశంలో కరోనా నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలను (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను) ఆదుకోవాలని ఆయన కేంద్ర సర్కారుని కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమైన ఎంఎస్ఎంఈల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ఆలస్యం కారణంగా ఎంఎస్‌ఎంఈలు జీఎస్టీ కట్టలేకపోతున్నాయని చెప్పారు.
దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు తాము ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఈల బకాయిలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించామని, ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.