BJP: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న పార్టీ
- కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేసే అవకాశం
- పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
- పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కూడా
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్ఠానం ఈ రోజు ఖరారు చేయనుంది. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు.
కర్ణాటకలో పరిణామాలతో పాటు కొన్ని నెలల్లో కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపట్టాలన్న విషయంపై బీజేపీ పలువురి పేర్లను పరిశీలించింది. వారిలో ఒకరిని ఖరారు చేయనుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటకలో దళితుడిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సరిగ్గా జరగనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటోన్న వైనంపై కూడా బీజేపీ నేతలు చర్చించనున్నారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఈ రోజు సాయంత్రంలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.