Artemis: నాసాకు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన బెజోస్!
- ఆర్టిమస్ కాంట్రాక్ట్ ఇస్తే డిస్కౌంట్
- నాసా చీఫ్ కు బెజోస్ లేఖ
- ఇప్పటికే స్పేస్ ఎక్స్ కు కాంట్రాక్ట్
ఈ మధ్యే అంతరిక్ష యాత్ర చేసొచ్చిన అమెజాన్, బ్లూ ఆరిజిన్ బాస్ జెఫ్ బెజోస్ బాగా జోష్ మీదున్నారు. అదే జోష్ తో చంద్రుడి మీద తన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు బంపరాఫర్ ప్రకటించారు. 2024లో నాసా చేపట్టనున్న చంద్రుడి ప్రయోగం ఆర్టిమస్ లో ఆస్ట్రోనాట్లు ప్రయాణించే వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్) తయారీ బాధ్యతలను తమకిస్తే 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,898 కోట్లు) డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించారు.
స్పేస్ క్రాఫ్ట్ నిర్మాణ ఒప్పందాన్ని గత ఏప్రిల్ లోనే ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కు నాసా అందజేసిన సంగతి తెలిసిందే. సుమారు రూ.21,600 కోట్ల (290 కోట్ల డాలర్లు) కాంట్రాక్ట్ ను స్పేస్ ఎక్స్ కు అప్పగించింది. బ్లూ ఆరిజిన్, డిఫెన్స్ కాంట్రాక్టర్ డైనెటిక్స్ బిడ్లను నాసా తిరస్కరించింది. లాక్ హీడ్ మార్టిన్, నార్త్ రాప్ గ్రమ్న్, డ్రేపర్ లతో కలిసి బ్లూ ఆరిజిన్ బిడ్ వేసింది.
స్పేస్ ఎక్స్ కు ఆర్బిటాల్ ప్రయోగాల్లో ఉన్న అపార అనుభవం, సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని స్పేస్ ఎక్స్ కు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు నాసా సీనియర్ అధికారి కేథీ ల్యూడర్స్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే నాసా అధిపతి బిల్ నెల్సన్ కు జెఫ్ బెజోస్ లేఖ రాశారు.
కాంట్రాక్ట్ ను తమకు అప్పగిస్తే ప్రయోగంలో 200 కోట్ల డాలర్ల డిస్కౌంట్ ను ఇస్తామని స్పష్టం చేశారు. నిర్ణయించిన కోట్ కే ఒప్పుకొంటామని, వ్యవస్థ అభివృద్ధికి అవసరమయ్యే అదనపు ఖర్చులను తామే భరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థకు ఆర్థిక సమస్యలున్నా కూడా రెండు వర్గాల ద్వారా ఆదాయాన్ని సృష్టించే పద్ధతి నుంచి నాసా వెనక్కొచ్చేసిందని, తమకు అవకాశం ఇస్తే ఆ సమస్య తీరిపోతుందని లేఖలో పేర్కొన్నారు.
లేఖ అందిందని చెప్పిన నాసా.. దానిపై స్పందించేందుకు మాత్రం నిరాకరించింది. స్పేస్ ఎక్స్ కు అక్రమ పద్ధతుల్లో కాంట్రాక్ట్ కట్టబెట్టారని పేర్కొంటూ అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ ఆఫీస్ కు ఇప్పటికే బెజోస్ లేఖ రాశారని గుర్తు చేసింది.