pegasus: పెగాసస్‌పై చర్చించాలని లోక్‌సభలో రాహుల్ సహా విపక్ష నేతల వాయిదా తీర్మానం
- దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్
- మండిపడుతోన్న విపక్షాలు
- నేడు అధికారులను ప్రశ్నించనున్న పార్లమెంటరీ ప్యానెల్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా లేఖ రాశాయి.
మరోపక్క, ఈ రోజు లోక్‌సభలో పెగాసస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష ఎంపీలు కలిసి వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అంతకు ముందు ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంటు వద్ద సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు. మరోవైపు, పెగాసస్‌పై సంబంధిత అధికారులను సమాచార సాంకేతికతకి చెందిన పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది. కేంద్ర ఐటీ, హోంశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కాగా, పెగాసస్ పై చర్చించాలని కొన్ని రోజులుగా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోవట్లేదు. దీంతో ఉభయ సభల్లో విపక్ష నేతలు ఆందోళనలకు దిగుతుండడంతో గందరగోళం నెలకొంటోంది. వాయిదాల పర్వం కొనసాగుతోంది.