Raghu Rama Krishna Raju: రూపాయి జీతం తీసుకునే జగన్.. హెలికాప్టర్ ఖర్చు తగ్గించుకుంటే మంచిది: రఘురామకృష్ణరాజు
- రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది
- జగన్ జనబాహుళ్యంలోకి రావాలి
- సీజేఐ ఎన్వీ రమణ తెలుగు భాషలో విచారణ జరపడం సంతోషకరం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆయన మండిపడ్డారు. రూపాయి జీతం తీసుకునే జగన్ హెలికాప్టర్ ఖర్చును తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పారు. తాడేపల్లి ప్యాలస్ ను వదిలి జగన్ జనబాహుళ్యంలోకి రావాలని అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనసుతో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారని... అయితే ఇళ్ల నిర్మాణాలను ఇంకా పూర్తి చేయలేదని ప్రజలు బాధ పడుతున్నారని చెప్పారు. ఇళ్ల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటేనే ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. ఇదిలావుంచితే, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు భాషలో విచారణ జరపడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. సొంత భాషలోని కమ్మదనం పరాయి భాషలో ఉండదని అన్నారు.