IMD: ఆగస్టు ఒకటో తేదీ వరకు దేశంలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

Heavy to very heavy rains predicted in country

  • పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
  • అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
  • జమ్మూకశ్మీర్‌‌లో నిన్న ఏడుగురి మృతి

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆగస్టు ఒకటో తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలంటూ భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.

రాజస్థాన్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, జమ్మూకశ్మీరులో నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లా హోంజార్‌లో భారీ వర్షాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌లో పేర్కొంది. రాజస్థాన్‌లోని నాగౌర్, సికర్, అజ్మేర్ జిల్లాలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాల్లో రెడ్ అలెర్ట్  ప్రకటించింది.

  • Loading...

More Telugu News