Etela Rajender: బాధగా ఉంది.. ఆగిన చోటు నుంచే యాత్ర మొదలవుతుంది: ఈటల
- వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలానే ఉన్నాయి
- ఆరోగ్యం కుదుటపడగానే యాత్ర ప్రారంభమవుతుంది
- ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఈటల
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలానే ఉన్నాయని, ఆగిన చోటు నుంచే యాత్ర మొదలవుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఊహించని అస్వస్థత కారణంగా ‘ప్రజా దీవెన’ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చినందుకు బాధగా ఉందని, ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కొండంత మీ దీవెనలతో మళ్లీ యాత్ర ప్రారంభిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఈ నెల 19న నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం నుంచి ఈటల పాదయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు 222 కిలోమీటర్ల మేర సాగింది. నిన్న వీణవంక మండలం కొండపాక వరకు నడిచారు. మధ్యాహ్న భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు పరీక్షలు చేయగా, జ్వరం, కాళ్ల నొప్పులతో ఈటల బాధపడుతున్నట్టు వెల్లడైంది. రక్తపోటు తగ్గిందని, షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయనను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.