Telugudesam: టీడీపీ నేతల గృహ నిర్బంధం.. పోలీసులకు చిక్కకుండా ఆర్టీసీ బస్సులో వెళ్లిన వంగలపూడి అనిత.. వీడియో ఇదిగో
- కొండపల్లి అటవీప్రాంతంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలని ఆరోపణలు
- అక్కడకు వెళ్తామంటోన్న టీడీపీ నేతలు
- అడ్డుకుంటోన్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అక్కడకు వెళ్తామని టీడీపీ నేతలు ప్రకటన చేయడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ పర్యటించేందుకు అనుమతి లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
తాము ఇప్పటికే అనుమతి కోరామని, నిజనిర్ధారణ చేయడానికి అధికారులను కూడా పంపాలని చెప్పామని, అయితే ఇందుకు ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వలేదని టీడీపీ నేతలు అంటున్నారు. కొండపల్లి అభయారణ్యంలో భారీ ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగినప్పటికీ అటవీశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు నిన్నటి నుంచే గృహ నిర్బంధాలు చేస్తుండడం గమనార్హం. వర్ల రామయ్యను విజయవాడలోని ఆయన ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే, గుంటూరులో నక్కా ఆనంద్‌బాబుకూ ఇదే అనుభవం ఎదురైంది.
విజయవాడలో బోండా ఉమా మహేశ్వరరావు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, కొనకొళ్ల నారాయణతో పాటు పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు.
తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీ ప్రాంతానికి వెళ్తామని వర్ల రామయ్య అన్నారు. తాము పోలీసులతో దెబ్బలు తిన్నా, తమను జైళ్లలోకి నెట్టినా ప్రజల కోసం పోరాడతామని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ముందస్తు అరెస్టులు చేస్తున్నారంటే కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లేనని వ్యాఖ్యానించారు.
కాగా, కొండపల్లి అక్రమ మైనింగ్ పై టీడీపీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ 10 మందిలో 8 మందిని పోలీసులు నిర్బంధించగా ఇద్దరు సభ్యులు పోలీసుల అడ్డంకులను, నిర్బంధాలను తప్పించుకుని ఆర్టీసీ బస్ లో టీడీపీ పార్టీ ఆఫీస్ కు చేరుకుంటున్నారని టీడీపీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
ఇటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉందని టీడీపీ మండిపడింది. రాష్ట్రంలో ఈ పరిస్థితి నాటి ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని, జగన్ ఎన్ని ఆటంకాలు కల్పించినా నిజ నిర్ధారణ కమిటీ కొండపల్లి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ పై నిజానిజాలను వెలికితీస్తుందని పేర్కొంది. పోలీసులకు చిక్కకుండా ఆర్టీసీ బస్సులో వెళ్లిన వంగలపూడి అనిత.. ఈ సందర్భంగా బస్సులోనే వైసీపీ తీరుపై మండిపడ్డారు.