Raghu Rama Krishna Raju: కారులో కూర్చున్న ఉమా దాడులు ఎలా చేస్తారు?: రఘురామకృష్ణరాజు
- కొన్ని రోజుల కిందట ఉమా అరెస్ట్
- రాజమండ్రి జైలుకు తరలింపు
- ఉమా ప్రాణాలకు ముప్పు ఉందన్న రఘురామ
- జైలు అధికారి బదిలీ అనుమానం కలిగిస్తోందని వ్యాఖ్య
కృష్ణా జిల్లా గడ్డ మణుగు గ్రామం వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనకు కోర్టు ఆగస్టు 10 వరకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయినా కారులో కూర్చున్న ఉమా దాడులు ఎలా చేస్తాడని వ్యాఖ్యానించారు.
తాజా పరిణామాలు చూస్తుంటే ఉమా ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్నానని తెలిపారు. రాజమండ్రి జైలు అధికారిని మార్చడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దేవినేని ఉమాను ఉంచిన రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ లింక్ ను మేజిస్ట్రేట్ కు ఇవ్వాలని రఘురామ అభిప్రాయపడ్డారు. రాజకీయ ఒత్తిడితో అన్యాయంగా కేసులు పెట్టే పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తానని రఘురామ తెలిపారు.