Tamil Nadu: మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన స్పెషల్ డీజీపీపై సస్పెన్షన్ వేటు

Special DGP suspended for sexual misbehavior with woman IPS

  • తమిళనాడులో తప్పు దోవ పట్టిన పోలీస్ ఉన్నతాధికారి
  • మహిళా ఐపీఎస్ పైనే లైంగిక వేధింపులు
  • ఆయనకు సహకరించిన మరో ముగ్గురు ఐపీఎస్ లు

సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖలోనే దారుణాలు జరుగుతున్నాయి. కొందరు అధికారుల నిర్వాకం వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే కలకలం రేపింది. ఇక్కడ బాధితురాలు సాక్షాత్తు ఒక ఐపీఎస్ అధికారిణి కావడం గమనార్హం. మహిళా ఐపీఎస్ అధికారిణిని డీజీపీ స్థాయి అధికారి లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ దారుణంలో మరో ముగ్గురు ఐపీఎస్ లు నిందితుడికి అండగా నిలిచారు. ఈ దారుణం తమిళనాడులో జరిగింది.
 
మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి భద్రతా విధులు నిర్వహిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిణిని స్పెషల్ డీజేపీ తన ఛాంబర్ కు పిలిపించుకున్నారు. సీఎం భద్రతా చర్యల గురించి చర్చించాలని నమ్మబలికి, తన కారులో ఎక్కించుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆమె బయల్దేరగా... ఆయన తన పలుకుబడిని ఉపయోగించి, ఆమె డీజీపీని కలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మార్గమధ్యంలో చెంగల్పట్టు చెక్ పోస్ట్ వద్ద మధ్య మండల ఐజీ, మహిళా డీఐజీ, చెంగల్పట్టు ఎస్పీ తో పాటు దాదాపు 50 మందికి పైగా పోలీసులు దారికాచి, ఆమె కారును అడ్డగించి, రాజీ చర్చలు జరిపారు. అయితే దీనికి ఒప్పుకోని బాధితురాలు అక్కడి నుంచి బయల్దేరే ప్రయత్నం చేయగా... ఆమె కారు తాళాలను అధికారులు లాక్కున్నారు. చివరకు ఎంతో ప్రయాసపడి ఆమె అక్కడి నుంచి బయటపడి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పడి విచారణ చేపట్టగా... విషయం నిర్ధారణ అయింది. చెంగల్పట్టు చెక్ పోస్టు వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని చెక్ చేయగా రాజీ ప్రయత్నాల సీన్ మొత్తం బయటపడింది. దీంతో స్పెషల్ డీజీపీతో పాటు ఆయనకు సహకరించిన ముగ్గురు పోలీస్ అధికారులపై కేసు నమోదైంది. స్పెషల్ డీజీపీపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే మిగిలిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై శాఖాపరమైన విచారణ జరగకపోవడంతో వారు విధులను నిర్వహిస్తున్నారు. దీంతో, వీరిపై ఛార్జ్ షీట్ వేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీబీసీఐడీ లేఖ రాసింది.

  • Loading...

More Telugu News