Prahlad Modi: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం వినిపించిన సోదరుడు ప్రహ్లాద్ మోదీ
- జీఎస్టీ కట్టకుంటే ఉద్ధవ్, మోదీ మీ ఇంటికే వస్తారు
- మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. బానిసత్వంలో కాదు
- ఉల్హాసన్నగర్ వ్యాపారుల సమావేశంలో ప్రహ్లాద్ మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఆయన సోదరుడు గళమెత్తారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆయన మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాసన్నగర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిన్న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులు తమ సమస్యలను సరైన మార్గంలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పోరాడాలని, అప్పటికీ వినకుంటే అప్పుడు జీఎస్టీ కట్టడం మానేయాలని సూచించారు. అప్పుడు ఉద్ధవ్ (‘మహా’ సీఎం), నరేంద్ర (మోదీ) మీ ఇంటికే వస్తారని అన్నారు.
‘‘నరేంద్రమోదీ కానీయండి, మరొకరు కానీయండి. ఎవరైనా సరే మొదట మీ సమస్యలను వినాలి. కాబట్టి ఈ రోజు నేను మీకు చెబుతున్నది ఒకటే. సమస్యలను పరిష్కరించేంత వరకు జీఎస్టీ కట్టబోమని తొలుత మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమేమీ బానిసలం కాదు’’ అని ప్రహ్లాద్ మోదీ అన్నారు. తాను దేశవ్యాప్తంగా 6.50 లక్షల ఫెయిర్ ప్రైస్ దుకాణ యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ కొవిడ్, లాక్డౌన్ తమను ఎలా దెబ్బతీసిందీ వివరించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించామంటూ పోలీసులు తమపై కేసులు నమోదు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.