Cheating: ఆన్ లైన్ రోమియో ఆటకట్టించిన కడప పోలీసులు
- సోషల్ మీడియాలో స్త్రీలతో పరిచయం
- వారి నగ్న ఫొటోల సేకరణ
- ఆపై బెదిరింపులు
- బీటెక్ ఫస్టియర్ తో నిలిచిన చదువు
- అక్కడ్నించి చోరీల బాట
ఆన్ లైన్ లో పరిచయమైన మహిళలను, అమ్మాయిలను మోసం చేస్తున్న కడప జిల్లా యువకుడు చెన్నుపల్లి ప్రసన్నకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసన్నకుమార్ బీటెక్ ఫస్టియర్ లోనే చదువుకు డుమ్మా కొట్టాడు. విలాసాలకు అలవాటు పడిన అతడు డబ్బు కోసం చోరీల బాటపట్టాడు. చెయిన్ స్నాచింగ్ లు, ఇళ్లలో చోరీలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆపై శ్రీనివాస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం కాగా, అతడికి సైతం టోకరా వేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని పత్తా లేకుండా పోయాడు.
ఆ తర్వాత ప్రసన్నకుమార్ ను కడప పోలీసులు ఓ దొంగతనం కేసులో అరెస్ట్ చేయగా, విచారణలో అతడిలోని మరో కోణం బయటపడింది. ఆన్ లైన్ లో అమ్మాయిలు, మహిళలతో పరిచయం పెంచుకుని, వారికి నమ్మకం కుదిరాక వారి నగ్న, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు. ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు రాబట్టేవాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా 200 మందికి పైగా అమ్మాయిలు, మహిళలు ప్రసన్నకుమార్ బారినపడ్డారు.
చూపులకు నాజూకుగా, అందంగా ఉండడంతో ఇట్టే అతడి మాయలో పడిపోయేవారు. తియ్యటి మాటలతో వారిని బుట్టలో వేసుకుని ఆపై తన నిజస్వరూపం ప్రదర్శించేవాడు. మోసపోయామని తెలిసినా, ఫిర్యాదు చేస్తే తమ పరువే పోతుందని మహిళలు, అమ్మాయిలు మౌనంగా కుమిలిపోయేవారు. దాంతో అతడి ఆగడాలు ఇన్నాళ్లూ సాగాయి.
అతడి ఫోన్ ను పరిశీలించిన పోలీసులే నివ్వెరపోయారు. ఫోన్ నిండా అమ్మాయిలు, మహిళల ఫొటోలే ఉన్నాయని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. ప్రసన్నకుమార్ నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అతడిపై ఏపీ, తెలంగాణలో కేసులు ఉన్నాయని వివరించారు.
కాగా, సోషల్ మీడియాలో ప్రశాంత్ రెడ్డి, రాజారెడ్డి, టోనీ అనే మారుపేర్లతో వ్యవహరించేవాడని గుర్తించారు. తనను తాను సంపన్నవర్గాల బిడ్డగా పరిచయం చేసుకుని స్త్రీలను ముగ్గులోకి దించేవాడు.