Amara Raja: ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనున్న ‘అమరరాజా’!

Amara Raja Group to shift its plant to Tamilnadu from AP

  • వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా బ్యాటరీస్
  • ఫ్యాక్టరీని మూసేయాలంటూ పీసీబీ నుంచి నోటీసులు
  • ఆ తర్వాత కంపెనీలో వరుస తనిఖీలు
  • మనస్తాపంతో కంపెనీని తరలించాలని నిర్ణయం
  • స్వాగతం పలికిన తమిళనాడు

వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏపీలోని అమరరాజా బ్యాటరీస్ సంస్థ తమిళనాడుకు తరలిపోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాటరీల తయారీలో దేశంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న అమరరాజా బ్యాటరీస్‌‌ సంస్థకు ఇటీవల కష్టాలు మొదలయ్యాయి. తిరుపతి శివారులోని కరకంబాడి వద్ద ఈ ప్లాంటు నుంచి పరిమితికి మించి కాలుష్యం వెలువడుతోందని, కాబట్టి మూసివేయాలంటూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏప్రిల్‌లో కంపెనీకి నోటీసులు జారీ చేసింది. దీంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది.

ఆ తర్వాత కార్మికశాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆరోగ్యశాఖలు ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా దాడి మొదలు కావడంతో మనస్తాపం చెందిన అమరరాజా యాజమాన్యం ప్లాంటును తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి అమరరాజా బ్యాటరీస్‌ను మరింత విస్తరించాలని సంస్థ భావించింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీని తమిళనాడుకు తరలించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అమరరాజా బ్యాటరీస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించబోతున్నట్టు వార్తలు రావడంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం సాదర స్వాగతం పలికినట్టు తెలుస్తోంది. తమ రాష్ట్రానికి వస్తే సకల సౌకర్యాలు కల్పిస్తామని, మధ్యవర్తులు కూడా అవసరం లేకుండానే అన్ని అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

నిజానికి తమకు వెళ్లిపోవాలన్న ఆలోచన లేకున్నా ప్రభుత్వం తమను ఇక్కడ ఉంచేలా కనిపించడం లేదని, అందుకనే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. చిత్తూరు జిల్లాలోనే ప్లాంటు విస్తరణ పనులు చేపట్టాలని ఇది వరకు భావించిన సంస్థ ఇప్పుడు వాటిని తమిళనాడుకు తరలించాలని నిర్ణయించిందని, మరో మూడు నెలల్లోనే అక్కడికి వెళ్లిపోవడం ఖాయమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ప్రధాన ప్లాంటును కూడా తరలించే యోచన ఉందని వివరించాయి.

  • Loading...

More Telugu News