Hair Salon: జీహెచ్ఎంసీ పరిధిలో హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. దరఖాస్తు చేసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం
- సెలూన్, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- ఇప్పటి వరకు చాలా తక్కువమంది దరఖాస్తు చేసుకున్నారన్న సోమేశ్ కుమార్
- మీ సేవ కేంద్రాల్లో ఉచిత నమోదు సౌకర్యం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హెయిర్ సెలూన్లు, లాండ్రీ దుకాణాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దుకాణాలకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఈ పథకాన్ని పొందేందుకు సెలూన్, లాండ్రీ దుకాణాల యజమానులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు.
ఇప్పటి వరకు అతి తక్కువమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకానికి అర్హులైన ఆయా సామాజిక వర్గాల వారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ కేంద్రాల్లోనూ ఉచిత నమోదు సౌకర్యం కల్పించామని, సద్వినియోగం చేసుకోవాలని సోమేశ్ కుమార్ కోరారు.