Elon Musk: భావోద్వేగంతో కన్నీరు పెట్టిన ఎలాన్ మస్క్: వీడియో ఇదిగో
- నాసా బతికించిందన్న టెస్లా సీఈవో
- స్పేస్ ఎక్స్ ను మూసే సమయంలో కాంట్రాక్ట్
- 150 కోట్ల డాలర్ల ఒప్పందం
ఎలాన్ మస్క్.. టెస్లా, స్పేస్ ఎక్స్ లతో సక్సెస్ కొట్టిన కోటీశ్వరుడు. అయితే, తన ఎదుగుదల వెనక ఎంతో కష్టం ఉందని అంటున్నారాయన. ఒకానొక దశలో స్పేస్ ఎక్స్ సంస్థను మూసేసుకోవాల్సి వచ్చినంత పనైందన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాసా ఒప్పందం గురించి చెబుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
సంస్థను ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తుండగా నాసా తమను బతికించిందని ఆయన చెప్పారు. సంస్థలో కనీసం పరికరాలు కొనే స్తోమత లేకపోయినా 150 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్ ను నాసా ఇచ్చిందన్నారు. ఆ క్షణాన ఏం చెప్పాలో తెలియలేదని, నాసా తమను కాపాడిందని అన్నారు. నాడు నాసా చేసిన సాయం ఎన్నటికీ మరచిపోలేనిదన్నారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయింది. దాదాపు 2.2 లక్షల మంది దానిని వీక్షించారు.
కాగా, తాను నాసాను ఎల్లప్పుడూ ఇష్టపడుతూనే ఉంటానని మస్క్ చెప్పారు. మంచి జరిగేందుకు పోరాడిన ప్రభుత్వంలోని అధికారులకు కృతజ్ఞతలు అని అన్నారు. వేరే వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. అమెరికాలోని మంచితనం ఇదేనన్నారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో ఆ ఒప్పందం ఏంటి? దేని గురించి? అన్న విషయాలను మాత్రం మస్క్ చెప్పలేదు.