Raghu Rama Krishna Raju: అమరరాజాకు భూకేటాయింపులు చేసింది వైఎస్సే... అప్పుడు లేని తప్పులు ఇప్పుడు కనపడ్డాయా?: రఘురామ
- రాష్ట్రం నుంచి తరలిన అమరరాజా
- బొత్స, సజ్జల చెరో మాట మాట్లాడుతున్నారన్న రఘురామ
- సజ్జల పేట్రేగిపోతున్నారని విమర్శలు
- ఉడుత ఊపులంటూ వ్యాఖ్యలు
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోవడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నాడు అమరరాజా కంపెనీకి భూములు కేటాయించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, మరి అప్పుడు లేని తప్పులు ఇప్పుడు కనిపించాయా? అని ప్రశ్నించారు.
అమరరాజా కంపెనీ తరలిపోవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెరొక మాట చెబుతున్నారని అన్నారు. సజ్జల తీరు అడ్డుఅదుపు లేకుండా ఉందని, రాష్ట్రంలోని అన్ని శాఖల గురించి సజ్జలే మాట్లాడతారా? అని నిలదీశారు.
కాగా, పార్లమెంటు వద్ద తనను బెదిరించిన గోరంట్ల మాధవ్ ను వైసీపీ నేతలు అభినందించినట్టు తెలిసిందని రఘురామ చెప్పారు. 'మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే చంపేస్తారా? మీ ఉడుత ఊపులు నా వద్ద కాదు... నేను చేస్తోంది ధర్మపోరాటం' అని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపైనా రఘురామ తన మనోభావాలను పంచుకున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడడాన్ని ఆయన స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే తాను కూడా ఎంపీ పదవిని త్యజించేందుకు సిద్ధమని ప్రకటించారు. టీడీపీ, వైసీపీ ఎంపీలందరూ రాజీనామాలు చేయడంతో పాటు, సీఎం జగన్ కూడా ఢిల్లీ వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.