Telangana: బలహీనపడిన రుతుపవనాలు.. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు
- తెలంగాణలో తగ్గుముఖం పట్టిన వర్షాలు
- సాధారణం కంటే 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదు
- ఉత్తర భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు
తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు బలహీనపడ్డాయి. ఫలితంగా వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లా వీపనగండ్లలో అత్యధికంగా 1.4 సెంటీమీటర్ల వర్షం కురవగా, నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌లో సెంటీమీటరు వర్షపాతం కురిసింది.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా తిమ్మారావుపేటలో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.