Andhra Pradesh: ఏపీలో మొదలైన ‘వనమహోత్సవం’.. మొక్కలు నాటిన సీఎం జగన్
- మంగళగిరి ఎయిమ్స్ లో ప్రారంభం
- 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మొక్కలు
- 33% పచ్చదనం ఉండేలా చేస్తామన్న సీఎం
రాష్ట్రంలో చెట్ల పెంపకం ఓ యజ్ఞంలా జరగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ లో ఆయన జగనన్న పచ్చతోరణం, వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావి, వేప చెట్లను నాటారు. అందరూ చెట్లను పెంచేలా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
పచ్చదనం ఉన్నచోటే వర్షాలు ఎక్కువగా పడతాయని, కాలుష్యమూ ఉండదని అన్నారు. చెట్లను పెంచడం చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది.
అది ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, సామాజికవనాలు, టింబర్ మిల్లుల్లో ఏటా అటవీశాఖ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతోంది. ఈ ఏడాది 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలను నాటనున్నారు. రెండేళ్లలో 33.23 కోట్ల మొక్కలను నాటారు.