Vinesh Phogat: టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్లో ఓడిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్
- 53 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్
- 3-9 తేడాతో వినేశ్ కు ఓటమి
- సెమీస్ కు దూసుకెళ్లిన వనెసా
- వినేశ్ కు రెపిచేజ్ దక్కే అవకాశం
భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కు టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ లో చుక్కెదురైంది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫోగాట్ బెలారస్ కు చెందిన వనెసా కలాజిన్ స్కయా చేతిలో 3-9తో ఓటమిపాలైంది. 53 కేజీల విభాగంలోని ఈ పోరులో వినేశ్ ఆరంభం నుంచి పేలవంగా కదిలింది. తన ప్రత్యర్థి వనెసా పటిష్ఠమైన డిఫెన్స్ ను ఛేదించడంలో వినేశ్ విఫలమైంది. అయితే, వినేశ్ కు ఇప్పటికీ పతకం గెలిచేందుకు ఓ అవకాశం ఉంది. అదే 'రెపిచేజ్'.
వినేశ్ పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన వనెసా, ఫైనల్లోకి వెళితే, 'రెపిచేజ్' కింద వినేశ్ కు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో అవకాశం ఇస్తారు.
రెపిచేజ్ అంటే.... 'ఏ' అనే రెజ్లర్ 'బి' అనే రెజ్లర్ పై నెగ్గి సెమీఫైనల్ కు, అక్కడ్నించి ఫైనల్ కు వెళితే... 'బి' అనే రెజ్లర్ కు రెండో చాన్స్ ఇస్తారు. దానర్థం.... 'బి' అనే రెజ్లర్ తన గ్రూప్ లో 'ఏ' అనే బలమైన పోటీదారుతో తలపడి ఓడిపోయినట్టు భావిస్తారు. అందుకే సానుభూతితో మరో అవకాశం ఇస్తారు. దీన్నే క్రీడా పరిభాషలో 'రెపిచేజ్' అంటారు. ఇప్పుడు వినేశ్ ముందర కూడా 'రెపిచేజ్' దక్కే అవకాశం నిలిచింది. అయితే, వినేశ్ కు ఆ అవకాశం దక్కాలంటే బెలారస్ అమ్మాయి ఫైనల్స్ కు వెళ్లాల్సి ఉంటుంది.