Tokyo Olympics: ఒలింపిక్స్ లో ఊహించని పరిణామం.. గోల్ఫ్ లో భారత్ కు పతకం ఖాయమేనట!
- రజతం లేదా కాంస్యం వచ్చే అవకాశం
- ప్రస్తుతం ఓ వైపు వానలు కురుస్తున్న వైనం
- గాలి ఎక్కువగా వస్తే మూడో రౌండ్ తోనే ఫలితాల వెల్లడి
- రేపు పతకధారులను తేల్చే నాలుగో రౌండ్
టోక్యో ఒలింపిక్స్ లో గోల్ఫ్ క్రీడలో ఊహించని పరిణామం జరిగింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో ఎక్కడో 41వ స్థానంతో సరిపెట్టుకున్న అదితీ అశోక్.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో అదరగొడుతోంది. మూడు రౌండ్లు ముగిసే సరికి రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అమెరికాకు చెందిన నెల్లీ కోర్డా అదితి కన్నా ముందుంది.
అయితే, ఎవరూ ఊహించని విధంగా గోల్ఫ్ లో అదితీ పతకం సాధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రజతం లేదా కాంస్యం గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. కారణం ప్రస్తుతం టోక్యోలోని వాతావరణమే. కొన్ని చోట్ల ఎండ కాస్తుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. ఒకవేళ గోల్ఫ్ కోర్స్ లో గాలి ఉద్ధృతంగా వీచి.. వాన పడితే మూడో రౌండ్ వరకు వచ్చిన ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు. అదే జరిగితే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితీకి రజత పతకం ఖాయమైనట్టేనంటున్నారు. అదీ కాదంటే కనీసం కాంస్యమైనా వచ్చే చాన్స్ ఉందంటున్నారు.
వాస్తవానికి మొదటి స్థానంలో ఉన్న నెల్లీ కోర్డాకు అదితీ దీటుగా పోటీనిచ్చింది. మొదటి రౌండ్ లో ఇద్దరూ 67 పాయింట్లతో సమానంగా నిలిచారు. అయితే, రెండో రౌండ్ లో 62 పాయింట్లు సాధించిన నెల్లీ.. 66 పాయింట్లను గెలిచిన అదితీని దాటేసి ముందుకు వెళ్లింది. మూడో రౌండ్ లో 68 పాయింట్లతో అదితీనే పైచేయి సాధించింది. ఒక్క రెండో రౌండ్ లోనే దాదాపు నాలుగు పాయింట్లు తేడా రావడంతో.. అదితీ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కెల్లీ 198 పాయింట్లు, అదితీ 201 పాయింట్లను సాధించారు. గోల్ఫ్ లో చివరి వరకు ఎవరికి తక్కువ పాయింట్లుంటే వారినే విజేతగా ప్రకటిస్తారు. రేపు పతకాన్ని ఖాయం చేసే నాలుగో రౌండ్ పోటీలు జరగనున్నాయి. కాగా, భారత్ కు చెందిన మరో గోల్ఫర్ దీక్షా దాగర్ 220 పాయింట్లతో 51వ స్థానంలో ఉంది.