America: కీలక మైలురాయిని చేరుకున్న అమెరికా.. సగం మందికి వ్యాక్సినేషన్ పూర్తి
- వ్యాక్సినేషన్ ప్రారంభమైన 8 నెలల్లో సగం మందికి
- జనాభాలో 70.6 శాతం మందికి తొలి డోసు
- శుక్రవారం నాటికి దేశంలో 34,97,87,479 డోసుల వినియోగం
అమెరికాలో సగం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయినట్టు పేర్కొంది. అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన 8 నెలలకు ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం.
మొత్తం 16,59,18,256 మందికి అంటే దేశ జనాభాలో సగం మంది కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు సీడీసీ తెలిపింది. అలాగే, దేశంలోని 70.6 శాతం మంది (18,23,68,493 మంది) కనీసం ఒక డోసు తీసుకున్నట్టు వివరించింది. శుక్రవారం నాటికి దేశంలో మొత్తం 34,97,87,479 డోసులను వినియోగించగా, ఇంతవరకు 40,51,02,715 డోసులను పంపిణీ చేసినట్టు సీడీసీ వివరించింది.