YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. కాలువలోంచి మారణాయుధాల వెలికితీతకు యత్నం!
- ఆయుధాలు పడేసిన ప్రదేశాన్ని చూపించిన సునీల్ యాదవ్
- యంత్రాల సాయంతో లక్ష లీటర్ల నీటిని తోడించిన అధికారులు
- ఇంకా మిగిలి ఉన్న మూడడుగుల నీరు
- మరో ముగ్గురిని విచారించిన సీబీఐ
ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక పురోగతి సాధించింది. ఆయనను హత్య చేసేందుకు ఉపయోగించిన మారణాయుధాలను ఓ కాలువలో పడేసినట్టు గుర్తించి నీటిని తోడించింది. కాలువలో నీరు ఎక్కువగా ఉండడంతో నేడు మిగతా నీటిని తోడనున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ విచారణలో ఈ విషయాన్ని వెల్లడించగా, వాటిని వెలికితీసేందుకు యత్నిస్తున్నారు.
సీబీఐ అధికారులు సునీల్‌ను నిన్న పులివెందులకు తీసుకెళ్లారు. అక్కడ అతడు ఆయుధాలను పడేసిన ప్రాంతాన్ని చూపించాడు. దీంతో సీబీఐ అధికారులు పారిశుద్ధ్య కార్మికుల్ని రప్పించి నీటిని తోడించారు. అయితే, కాలువలో నీరు 8 అడుగుల వరకు ఉండడంతో యంత్రాల సాయంతో లక్ష లీటర్ల నీటిని తోడించారు. ఇంకా మూడు అడుగుల నీరు ఉండడంతో నేడు మిగతా నీటిని తోడనున్నారు.
వివేకా ఇంటి నుంచి కాలువ వరకు వెళ్లేందుకు రెండు దారులు ఉండగా, సీసీ కెమెరాలు లేని రెండో దారిని నిందితులు ఎంచుకున్నట్టు సీబీఐ గుర్తించింది. కాలువలో ఆయుధాలు పడేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి రింగురోడ్డు పైకి వెళ్లి పరారయ్యారు. కాగా, సీబీఐ అధికారులు నిన్న వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, కడప రైల్వే స్టేషన్ మేనేజర్ మోహన్‌రెడ్డిని విచారించారు.