COVID19: ఇక, క్వారంటైన్​ అక్కర్లేదు.. భారత్​ ను ‘రెడ్’​ లిస్టు నుంచి తొలగించిన బ్రిటన్: ఇవీ ప్రయోజనాలు

UK Lifts Curbs On Indian Travelers

  • హోటల్ లో క్వారంటైన్ రూల్ ఎత్తివేత
  • ‘యాంబర్’ జాబితాలోకి మార్పు
  • ఇంట్లోనే 10 రోజులుంటే చాలు
  • వ్యాక్సిన్ వేసుకున్నవారికి మినహాయింపులు

భారత్ కు బ్రిటన్ ఇవాళ ఓ తీపి కబురు చెప్పింది. కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో భారత్ నుంచి వచ్చే వారిపై ఆ దేశం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. భారత్ ను రెడ్ లిస్టులో కూడా పెట్టింది. అయితే, తాజాగా ఆ ఆంక్షలను ఎత్తేసింది. భారత్ ను రెడ్ లిస్ట్ నుంచి తొలగించి ‘యాంబర్’ జాబితాలో చేర్చింది. దాని ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు 10 రోజుల తప్పనిసరి హోటల్ క్వారంటైన్ ఇకపై నుంచి అవసరం లేదు. ఈ రోజు ఉదయం దానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది.

భారత్ నుంచి వచ్చేవారంతా.. లొకేటర్ దరఖాస్తులో పేర్కొన్న చిరునామా లేదా నివాసంలోనే ఐసోలేషన్ కావొచ్చని హెల్త్ అండ్ సోషల్ కేర్ విభాగం (డీహెచ్ఎస్సీ) పేర్కొంది. 1,750 పౌండ్లు అదనంగా చెల్లించి ప్రభుత్వ అధీకృత కేంద్రాల్లో ఐసోలేట్ అవ్వాలన్న నిబంధననూ తొలగించివేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీకాలు అందుబాటులోకి వచ్చాయని, బ్రిటన్ లో తయారుకాని వ్యాక్సిన్ల సర్టిఫికెషన్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.

ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్ భారత వెర్షన్ ‘కొవిషీల్డ్’కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దానికి రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, యాంబర్ జాబితాలో ఉన్న దేశాలకు చెందిన వారు.. ఇంగ్లండ్ ప్రయాణానికి మూడురోజుల ముందు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ కు వెళ్లాక రెండు టెస్టులు చేయించుకునేందుకు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

లొకేటర్ దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో 10 రోజుల పాటు సొంతంగా క్వారంటైన్ అవ్వాలి. రెండు రోజుల తర్వాత ఒక టెస్ట్, ఆ తర్వాత 8వ రోజున మరో టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ స్థానికుడై ఉండి, బ్రిటన్ ఆమోదించిన లేదా బ్రిటన్ తయారు చేసిన టీకాలను వేరే దేశంలో వేసుకుని వచ్చిన 18 ఏళ్ల లోపు వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది.

కాగా, ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం పరిమిత సంఖ్యలో మాత్రమే విమానాలు నడుస్తాయి. మిగతా విమానాలన్నింటిపైనా యథావిధిగా నిషేధం అమల్లో ఉంటుంది. మరోవైపు భారత్ ను రెడ్ లిస్ట్ నుంచి తొలగిస్తామని బ్రిటన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించినప్పటి నుంచి విమాన బుకింగ్స్ బాగా పెరిగాయని ఎయిర్ లైన్స్ ఆపరేటర్లు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News