Chandrababu: 600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఓ చరిత్ర: చంద్రబాబు

Chandrababu lauds Amaravathi farmers agitations

  • 600 రోజులుగా అమరావతి రైతుల దీక్షలు
  • నేడు ర్యాలీకి అడ్డుచెప్పిన పోలీసులు
  • చంద్రబాబు స్పందన
  • రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన

అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటం నేటితో 600 రోజులకు చేరగా, జేఏసీ ర్యాలీకి పోలీసులు అడ్డుచెప్పారు. పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఓ చరిత్ర అని ఉద్ఘాటించారు. ప్రజా రాజధాని కోసం రైతులు 32,323 ఎకరాలు త్యాగం చేశారని వెల్లడించారు. అమరావతిలో రైతులు, రైతు కూలీలు సాగిస్తున్న న్యాయపోరాటానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదు, ఆంధ్రులకు రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం అని పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్నది అమరావతిపై దాడి మాత్రమే కాదని, రాష్ట్ర సంపదపైనా దాడి చేస్తోందని ఆరోపించారు. ఎంతో విద్వేషంతో ప్రజా రాజధానిని జగన్ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ వల్ల 139 సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాయని వెల్లడించారు. అమరావతి అంతానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్రంటూ లేదని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే, మరింత ఉద్ధృతమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News